సర్పంచ్ ఎన్నికల్లోనూ కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. -రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్
మంగళగిరి, మేజర్‌న్యూస్ :
ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తే, చంద్రబాబు గారు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించి బీసీలను ఆదరించారని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ గుర్తు చేశారు. అయితే, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ మోహన్ రెడ్డి స్థానిక సంస్థల రిజర్వేషన్లను 34 శాతం నుండి 20 శాతానికి తగ్గించి, సుమారు 16 వేల పదవులు బీసీలకు దక్కకుండా చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో బీసీలు 54.5 శాతం ఉన్న బీసీలకు చంద్రబాబుగారు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీనిని వైసీపీ కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేసినా, కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడిందని వివరించారు. అంతేకాకుండా, పార్టీ పరంగా 34 శాతం, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 40 శాతం సీట్లు కేటాయించి బీసీల పక్షాన నిలిచిందని పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రాకుండా వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేసినా, బీసీలందరూ ఏకతాటిపై నిలిచి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి అపూర్వ విజయాన్ని అందించారని ఆయన ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లోనూ కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామ స్వరాజ్యం సాధ్యపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళగిరి మేయర్ అభ్యర్థిగా రేకుల ఇంట్లో నివసించే ఒక సామాన్య ఎస్టీ కార్యకర్తకు అవకాశం కల్పించడం అభినందనీయమని, జడ్పీపీ (ZPP) ఎంపికలోనూ బీసీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లకు బీసీల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో నారా లోకేష్ చూపిన చొరవ, పర్యవేక్షణ ప్రశంసనీయమని కొనియాడారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, గత రెండున్నరేళ్లుగా కూటమి ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తోందని, రాబోయే రోజుల్లో బీసీలు, మహిళలు, యువతకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని గొల్ల నరసింహ యాదవ్ స్పష్టం చేశారు.