శంషాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యమెందుకు?
నడిరోడ్డుపై డ్రైనేజీ గుంట తవ్వకాలు.. అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం!
బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు చక్రధర్ రెడ్డి ఆగ్రహం
జీహెచ్‌ఎంసీ శంషాబాద్ _118వ డివిజన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు చక్రధర్ రెడ్డి ప్రశ్నించారు. శంషాబాద్‌లోని పోచమ్మగడ్డ దేవాలయం–సూరజ్ గార్డెన్ రోడ్డులో నడిరోడ్డుపై డ్రైనేజీ గుంట తవ్వి నిర్మాణ పనులు చేపడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు.
మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా రహదారిపై డ్రైనేజీ గుంట తవ్వి నిర్మాణ పనులు చేపట్టడం వల్ల ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చక్రధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమస్యకు సంబంధించిన ఆధారాలతో సహా జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఇప్పటికే సమాచారం అందించినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా పనులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. ఫిర్యాదులు చేసినా స్పందించకపోవడంతో అధికారుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
శంషాబాద్ డివిజన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై అధికారులు తక్షణమే దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. పోచమ్మగడ్డ దేవాలయం–సూరజ్ గార్డెన్ రోడ్డులో జరుగుతున్న పనులను పరిశీలించి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రహదారులపై చేపడుతున్న నిర్మాణ పనులను పర్యవేక్షించాలని, అక్రమ నిర్మాణాల విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని చక్రధర్ రెడ్డి జీహెచ్‌ఎంసీ అధికారులను డిమాండ్ చేశారు.
పోతుల నర్సింహా, మేజర్ న్యూస్ శంషాబాద్.