వన్యప్రాణులను వేటాడుతున్న ముగ్గురు నిందితులు అరెస్ట్* * రెండు తుపాకులు, 37 ఇనుప గుండ్లు స్వాధీనం… వన్యప్రాణుల మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు-సీఐ నాగరాజు, ఎస్సై రాజేష్ కుమార్..*
సూర్య దమ్మపేటమండల పరిధిలో అక్రమ ఆయుధాలతో వన్యప్రాణుల వేట సాగిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నాటు తుపాకులతో అడవి జంతువుల ప్రాణాలు తీసేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్తున్న ముగ్గురు వేటగాళ్లను శనివారం పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా తాము నాటు తుపాకులతో సమీప అటవీ ప్రాంతాల్లో క్రూర జంతువులను, వన్యప్రాణులను వేటాడుతున్నట్లు విచారణలో నిందితులు అంగీకరించారు.
వారి వద్ద నుంచి రెండు నాటు తుపాకులు, సుమారు 100 గ్రాముల నల్లటి గన్ పౌడర్, వన్యప్రాణులపైకి కాల్పులు జరిపేందుకు సిద్ధంగా ఉంచుకున్న 37 చిన్న ఇనుప గుండ్లు, ఇతర వేట సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశ్వరావుపేట సీఐ నాగరాజు, దమ్మపేట ఎస్సై రాజేష్ కుమార్ ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కాగా, ఈ ముఠాకు చెందిన మరో నిందితుడు పెనుబల్లి శ్రీను దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వేరొక కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
*అటవీ జీవుల అక్రమ రవాణా, వేటపై ప్రత్యేక నిఘా.!*
ఈ సందర్భంగా అశ్వరావుపేట సీఐ నాగరాజు, దమ్మపేట ఎస్సై రాజేష్ కుమార్ మాట్లాడుతూ.. అటవీ సంపదను ధ్వంసం చేసినా, మూగజీవాలైన అడవి జంతువులను వేటాడినా చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అడవి జంతువులను వేటాడటమే కాకుండా, వాటి మాంసాన్ని అక్రమంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న వారిపై గట్టి నిఘా ఉంచామన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రజలు, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అక్రమ వేటపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో పోలీస్ సిబ్బంది, సివిల్ సిబ్బంది పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్ దస్తగీర్ దమ్మపేట