సైబర్ మోసాలపై అప్రమత్తతే శ్రీరామరక్ష.. -- అవగాహనతోనే నేరాల నియంత్రణ సాధ్యం -- నారాయణపేటలో పోలీసుల ఫ్లాష్ వాక్ – బాధితులు వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి -- నారాయణపేట ఎస్పీ డాక్టర్ జి. వినీత్
నారాయణపేట, సూర్యన్యూస్: సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించి, ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా అప్రమత్తం చేయడమే లక్ష్యంగా నారాయణపేట జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం అవగాహన ప్రదర్శన (ఫ్లాష్ వాక్) నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి సావర్కర్ చౌరస్తా వరకు సాగిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ జి. వినీత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు సైతం కొత్తకొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఆన్‌లైన్ మోసాలు, నకిలీ లింకులు, పెట్టుబడుల పేరుతో మోసాలు, పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరిట మోసాలు, సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులు, డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరింపుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకసారి మాత్రమే ఉపయోగించే రహస్య సంకేతాలు (ఓటీపీ), బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం రహస్య సంఖ్యలు, వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద లింకులను తెరవకూడదని, అధిక లాభాలు వస్తాయనే ఆశతో తెలియని పెట్టుబడి పథకాల్లో డబ్బులు పెట్టవద్దని సూచించారు. పోలీసులమని, ప్రభుత్వ అధికారులమని ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని స్పష్టం చేశారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే భయపడకుండా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ సైబర్ నేరాల సహాయ కేంద్రం 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. సైబర్ నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతా నియమాలు పాటించడంతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తులకు సైతం అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. సైబర్ నేరాల నివారణకు నారాయణపేట జిల్లా పోలీసు శాఖ నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.డి. రియాజ్ ఉల్ హక్, డీఎస్పీలు మహేష్, నల్లపు లింగయ్య, సీఐలు శివశంకర్, రామ్‌లాల్, భగవంత్ రెడ్డి, సైదులు, ఆర్‌ఐ విజయ్ భాస్కర్, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, విజయ్ భాస్కర్, బాలరాజు, నరేష్, కేటీ మల్లేష్, పురుషోత్తం, పోలీసు సిబ్బంది, యువత పాల్గొన్నారు.
– రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.