మధుర నగర్ వెంచర్ ప్లాట్ల వివాదం.. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రాజ్‌పై పోలీసులకు ఫిర్యాదు
తాండూరు, మేజర్ న్యూస్:తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ భర్త బాల్‌రాజ్‌పై పలువురు ప్లాట్ల యజమానులు యాలాల పోలీస్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. తాండూరు పట్టణ సమీపంలోని కొడంగల్ రోడ్డులో ఉన్న మధుర నగర్ వెంచర్‌లో తమకు చెందిన ప్లాట్లలోకి అక్రమంగా ప్రవేశించి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితమే తాము అక్కడ భూములు కొనుగోలు చేసి ప్లాట్లు చేసుకున్నామని, ఇటీవల బాల్‌రాజ్ తమ ప్లాట్లలోకి వచ్చి జోక్యం చేసుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన కొందరు ముఖ్యుల అండదండలతో తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రశ్నించేందుకు వెళ్లగా, తనను ఎవరూ ఏమీ చేయలేరని, ఎక్కడైనా చెప్పుకోవచ్చంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ ప్లాట్ల విషయంలో న్యాయం జరిగేలా విచారణ చేపట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ మేరకు రాజన్ గౌడ్, భారతీ రెడ్డి, మహేష్ చారి, శ్రీధర్ తదితరులు యాలాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.