రాష్ట్రస్థాయి మాక్ పార్లమెంట్‌లో మెదక్ విద్యార్థినికి ప్రథమ స్థానం
మెదక్: రాష్ట్రస్థాయిలో నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో మెదక్ జిల్లా శంకరంపేట మోడల్ స్కూల్ విద్యార్థిని బి. ఆర్తి చంద్ర అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచారు. పదో తరగతి చదువుతున్న ఆమె బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డును కైవసం చేసుకుని జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఈ మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో తెలంగాణలోని 33 జిల్లాల నుంచి మొత్తం 66 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా శంకరంపేట మోడల్ స్కూల్‌కు చెందిన ఆర్తి చంద్ర డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించి తన ప్రతిభను చాటుకున్నారు. సభా నిర్వహణ, పార్లమెంటరీ విధానాలపై అవగాహన, సమర్థవంతమైన ప్రదర్శనతో రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతిని అందుకున్నారు.రాష్ట్రస్థాయిలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ మదన్ మోహన్ చేతుల మీదుగా ఆర్తి చంద్ర అవార్డును అందుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రాజు విద్యార్థిని ఆర్తి చంద్రను ప్రత్యేకంగా అభినందించారు. ఆమెకు మార్గదర్శకత్వం వహించిన గైడ్ టీచర్, పీజీటీ లింగమయ్య, పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు కార్యక్రమానికి సహకరించిన సోషల్ ఫోరం బాధ్యులు నర్సింలు, రవిబాబులను అభినందించారు.విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ వ్యవస్థపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన ఆర్తి చంద్రను ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాభిమానులు అభినందించారు.