సీఎం సభకు కాంగ్రెస్ జోరు జనసమీకరణ! -చిన్నకోడూరు నుంచి 15 వేల మందితో "ఛలో సిద్దిపేట"
చిన్నకోడూరు, :సిద్దిపేటలో నవంబర్ 19న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పాల్గొననున్న భారీ బహిరంగ సభకు చిన్నకోడూర్ మండలం నుంచి పెద్దఎత్తున ప్రజలను తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ఈ సభకు మండలం నుంచి సుమారు 10 వేల నుంచి 15 వేల మంది ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లనున్నట్లు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బుస్స రాజశేఖర్ ముదిరాజ్ వెల్లడించారు.సభలో ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం, ఇందిరమ్మ చీరల రెండో విడత పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రజల్లో ఆసక్తి నెలకొందని ఆయన తెలిపారు.ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ నాయకత్వంలో భారీ జనసమీకరణకు ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, సభకు భారీ సంఖ్యలో ప్రజలను సమీకరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.నవంబర్ 19న చిన్నకోడూర్ మండలం నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చి సిద్దిపేట సభలో పాల్గొంటారని, సభను విజయవంతం చేసేందుకు ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తున్నాయని బుస్స రాజశేఖర్ ముదిరాజ్, లహరి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ వినోద్, పెద్దకోడూర్ వార్డు సభ్యుడు నాయిని రవి, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, సీనియర్ నాయకులు అజ్జు యాదవ్, అనిల్, గుండు వెంకటేష్, రేపాక రాములు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.