సీఎం పర్యటనకు పటిష్ట పోలీసు బందోబస్తు.. సిబ్బందికి ఎస్పీ స్నేహ మెహ్రా దిశానిర్దేశం
కొడంగల్, మేజర్ న్యూస్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ పోలీసు అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు బందోబస్తు విధులపై ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన అత్యంత కీలకమైనదని, ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. విధుల్లో సమయపాలన, క్రమశిక్షణ పాటిస్తూ వాహనాల తనిఖీలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, రూట్ బందోబస్తు, సభా ప్రాంగణ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసు సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఉన్నతాధికారుల సూచనలు పాటించాలని, ముఖ్యమంత్రి పర్యటనను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వర్తించాలని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా, సంగారెడ్డి అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.