నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం -బంగారు ఆభరణాలు దొంగలించిన యువకుడి అరెస్ట్ -కోదాడ డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి
నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం
-బంగారు ఆభరణాలు దొంగలించిన యువకుడి అరెస్ట్
-కోదాడ డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి
హుజూర్ నగర్ నగర్ రూరల్, మేజర్ న్యూస్ : నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కోదాడ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.కోడి పందాలు, చెడు వ్యసనాలకు బానిసై అప్పులపాలైన ఓ యువకుడు తన ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు సొంత కుటుంబ సభ్యుల బంగారు ఆభరణాలనే దొంగిలించిన ఘటన హుజూర్నగర్ పట్టణంలో వెలుగుచూసింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకుని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హుజూర్నగర్ పట్టణంలోని కనకదుర్గమ్మ గుడి బజార్‌కు చెందిన మల్లెబోయిన నిఖిల్ (19) చిన్నతనం నుంచి తన అమ్మమ్మ, తాతయ్య కోడి ఉమా, జనార్ధన్ ఇంట్లో ఉంటూ పెరిగాడు. ప్రస్తుతం కోదాడ పట్టణంలోని ఎన్ఆర్ఎస్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.అయితే గత రెండేళ్లుగా పాత నేరస్థుడు తన క్లాస్‌మేట్‌తో కలిసి చెడు వ్యసనాలకు అలవాటుపడి కోడిపందాల్లో పందాలు కాస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు.అప్పులు తీర్చేందుకు తెలిసిన వారి వద్ద అధిక వడ్డీకి డబ్బులు తీసుకొని మళ్లీ కోడిపందాలు ఆడుతూ ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డాడు. చేసిన అప్పులు తీర్చలేక దొంగతనాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో సుమారు ఆరు నెలల క్రితం తన అమ్మమ్మ కోడి ఉమాకు చెందిన బంగారు గొలుసును దొంగిలించాడు. అనంతరం తన స్నేహితుడితో కలిసి అందులోని అర తులం బంగారాన్ని కరిగించి గుర్తుతెలియని వ్యక్తులకు విక్రయించి వచ్చిన డబ్బులను విలాసాలకు ఖర్చు చేశారు. ఈ నెల 3-11-2026 రాత్రి తన మేనత్త కోడి ఉపేంద్రకు చెందిన మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడును దొంగిలించాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు హుజూర్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో హుజూర్నగర్ పట్టణంలో గోల్డ్ షాపుల వైపు సిబ్బందితో కలిసి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులను పట్టుకున్నారు.విచారణలో వారు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.నిందితుల నుంచి ఒక తులం కరిగించిన బంగారు ముద్దతో పాటు మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో సిఐ చరమందరాజు, ఎస్ ఐ నరేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి
హుజూర్నగర్ పరిసర ప్రాంతాల్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు సంచరిస్తున్నట్లు సమాచారం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా 112 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.