విద్య, వైద్యం, తాగునీరు, రహదారుల అభివృద్ధికి పెద్దపీట
• మందమర్రి రూపురేఖలు మార్చేలా అభివృద్ధి పనులు
• పట్టణంలో వెయ్యి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సన్నాహాలు
• మంత్రి గడ్డం వివేకానంద
సూర్య, మందమర్రి :
మందమర్రి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద వెల్లడించారు. పట్టణంలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు పేదలకు ఇళ్లు, మెరుగైన విద్య, వైద్య సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి భూములను సేకరించి సుమారు వెయ్యి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. శుక్రవారం స్థానిక బి-1 క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి మంత్రి 68 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులకు సకాలంలో అందాలని, మంజూరైన చెక్కులను రెండు రోజుల్లోగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే రెండు లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని, రాబోయే రెండేళ్లలో మరో రెండు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. మందమర్రి ప్రాంతంలో భూముల సమస్యను పరిష్కరించేందుకు సింగరేణి సీఎండీతో చర్చలు జరుపుతున్నామని, సంస్థకు చెందిన భూమిని సేకరించి వెయ్యి ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. పట్టణంలో రూ.7 కోట్ల వ్యయంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు మంజూరు లభించిందని మంత్రి తెలిపారు. అలాగే చెన్నూరు నియోజకవర్గంలోని సోమనపల్లిలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం జరుగుతోందన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు వసతి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు అవసరమైన సదుపాయాలు ఒకే చోట కల్పించనున్నట్లు చెప్పారు. పట్టణంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు స్థల పరిశీలన పూర్తయిందని, వచ్చే ఏడాది మార్చిలోగా అనుమతులు సాధించి నిర్మాణ పనులు ప్రారంభించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణం, అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి వెల్లడించారు. మూడు నుంచి నాలుగు నెలల్లో ఈ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సుమారు రూ.30 కోట్లతో ఇందిరా వాటర్ స్కీమ్, అమృత్ పథకాల ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించేందుకు ప్రణాళిక అమలు చేస్తున్నామని చెప్పారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలతో పేద కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతోందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి నెలకు సుమారు రూ.5 వేల మేర ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు. మందమర్రి ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు కొత్త మైన్ ఏర్పాటుతో పాటు ఏటీసీ శిక్షణ కేంద్రం ద్వారా నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జర్మన్ భాషలో శిక్షణ కల్పించి విదేశాల్లో ఉద్యోగాలు పొందేలా యువతకు అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నీరు, విద్యుత్ వినియోగంలో ప్రజలు పొదుపు పాటించాలని సూచించారు. రైతులు నీటి లభ్యతను అంచనా వేసుకొని పంటల సాగు చేపట్టాలని, అధిక నీటి అవసరమున్న వరి సాగుపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.38 వేల కోట్లతో ప్రతిపాదనలు రూపొందించగా, ఇప్పటివరకు రూ.11 వేల కోట్ల పనులు పూర్తయ్యాయని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అర్హులైన వారెవరూ మిగిలిపోకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కోటపల్లి మండలంలో నూతన ఎస్సీ వసతి గృహం, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణానికి రూ.1.60 కోట్లతో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రామకృష్ణాపూర్‌లో సింగరేణి సహకారంతో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మందమర్రి, భీమారం, జైపూర్ మండలాల్లో విద్యార్థుల నమోదు శాతం 10 శాతానికి పైగా పెరిగిందన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు. అమృత్ పథకం కింద మందమర్రిలో తాగునీటి పైప్‌లైన్ పనులు, క్యాతనపల్లిలో రెండు నీటి ట్యాంకులు, చెన్నూరులో మూడు నీటి ట్యాంకుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, డ్రైనేజీతో పాటు మహిళా భవనాలు, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పనకంటి సతీష్ కుమార్ శర్మ, మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, డీసీసీ ప్రతినిధి రఘునాథ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.