సమస్యలు పరిష్కరించని సర్వసభ్య సమావేశాలు ఎందుకు.. అధికారుల తీరుపై మండిపడ్డ సర్పంచ్ రామేశ్వర్
మర్పల్లి, మేజర్ న్యూస్ : ప్రజా సమస్యలు పరిష్కారం కానప్పుడు సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమిటని మర్పల్లి గ్రామ సర్పంచ్ ఎం. రామేశ్వర్ అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే సమావేశాల్లో అధికారులు తమ శాఖల నివేదికలు చదవడం, ప్రజాప్రతినిధులు వినడంతోనే సరిపెడుతున్నారని, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు మాత్రం పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు మర్పల్లి మండల కేంద్రంలో నోడల్ అధికారి, ఎంపీడీవో శాంత అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో అసెంబ్లీ స్పీకర్ సమక్షంలో పలుమార్లు సమస్యలను ప్రస్తావించినప్పటికీ ఇప్పటివరకు పరిష్కారం కాలేదని, ముఖ్యంగా మర్పల్లి బస్టాండ్ సమస్యను స్పీకర్ స్వయంగా అధికారులకు ఆదేశించినా నేటికీ పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు. మండల కేంద్రంలో రూ.33 కోట్లతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులు ఇంకా పూర్తికాకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమా, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. తన ఇంటి కారణంగా అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, అవసరమైతే అభివృద్ధి కోసం తన ఇంటిని తానే తొలగించుకుంటానని స్పష్టం చేశారు. మంచి పనుల కోసం అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని తెలిపారు. మండలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో బోర్లు మంజూరు చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను కోరారు. అలాగే స్మశానవాటిక సమస్యను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్ మనోహర్ చక్రవర్తిని కోరగా, బుధవారం లోపు సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీవో అంజిరెడ్డి మాట్లాడుతూ వికసిత్ భారత్ కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధికి ఎంతో తోడ్పాటు లభిస్తుందని, సర్పంచులందరూ సమన్వయంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. గ్రామాల్లో ఇంకుడు గుంతలు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ మర్పల్లి మండలానికి లింక్ రోడ్ల నిర్మాణం కోసం రూ.9.26 కోట్లు, అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం స్పీకర్ అనుమతితో రూ.30 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. గ్రామాల అభివృద్ధికి స్పీకర్ ప్రత్యేక కృషి చేస్తున్నారని, మంజూరైన నిధులతో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ అధికారి రాజు, సంక్షేమ శాఖ, మండల మహిళా సమాఖ్య, ఉద్యానవన, అటవీ, రెవెన్యూ తదితర శాఖల అధికారులు తమ శాఖల వివరాలను వెల్లడించారు. ఎంపీడీవో శాంత, తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచులు రాజు, రామేశ్వర్, మహేందర్, వివిధ శాఖల అధికారులు, గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.