telangana
సమస్యల వలయంలో చంపాపేట్ దివ్యాంగుల సదనం
కర్మన్ ఘాట్, మేజర్ న్యూస్ : రంగారెడ్డి జిల్లాలోని ఉన్న దివ్యాంగుల సధన విద్యార్థుల సమస్యలు పరిష్కరించి సదనాలను అన్ని విధాల అభివృద్ధి చేయాల్సిన రంగారెడ్డి జిల్లా డి డబ్ల్యు ఓ, సూపర్డెంట్ సంక్షేమాన్ని విస్మరించి ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తూ నారని సదనంలోనే దివ్యాంగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగులకు ఎఫ్ ఆర్ ఎస్ ఏ( ముఖ చిత్రీకరణ ) పెడతామంటూ సంఖ్యను తగ్గిస్తామంటూ పదేపదే మాట్లాడుతున్న అధికారులు సదనంలోని తీవ్ర సమస్యలైన డ్రైనేజీ వ్యవస్థ, శిథిలావస్థలో ఉన్న వసతి గృహాలను మరమ్మతులు చేయకుండా దివ్యాంగులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని దివ్యాంగుల రాజ్యాధికార ఫోరం అధ్యక్షులు వంశరాజ్ రామచంద్ర అన్నారు. వసతి గృహాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నీళ్ల చారు, పప్పు చారు, ఉడికి ఉడకని ఆహారాన్ని అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంపాపేటలోని దివ్యాంగుల సదనంలో చాలా సంవత్సరాలుగా డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని, ఎలుకలు, నల్లులు, పందికొక్కులు, అపరిశుభ్రత వాతావరణం అధ్వానంగా బాత్రూములు కంపు కొడుతున్న దుర్వాసనతో కాలం వెల్లదీస్తున్నారని, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సంవత్సరాల తరబడి భవనాన్ని మరమ్మతులు చేయకుండా దివ్యాంగులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు అని అన్నారు. 2016 దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం అన్ని వసతి గృహాలు చట్ట విరుద్ధంగా ఉన్నాయని, ఉన్నత అధికారులు ప్రభుత్వం స్పందించి రంగారెడ్డి జిల్లా డి డబ్ల్యూ ఓ, సూపర్డెంట్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే సదన భవనాలకు మరమతులు చేపట్టాలని అన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులందరికీ భోజనం అందించాలని, గత 10 నెలలుగా బిల్స్ మంజూరు చేయకపోవడంతో అధికారులు అలసత్వం,నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. గత నాలుగు సంవత్సరాలుగా నోట్ బుక్స్ విద్యార్థులకు అందివ్వకుండా, అదేవిధంగా రెండు సంవత్సరాలుగా కాస్మోటిక్స్ చార్జీలు ఇవ్వకుండా అవినీతి అక్రమాలకు అధికారులు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా దివ్యాంగుల సదనాల విద్యార్థులపై దృష్టి సారించి వారి సంక్షేమానికి ప్రత్యేకంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరించే అధికారులను గుర్తించి 2016 హక్కుల చట్టం ప్రకారం వారిని సస్పెండ్ చేసి శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.