ప్రజలందరూ మధుమేహంపై అవగాహన పెంచుకొవాలి-ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్
సూర్య మంచిర్యాల:ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం రోగులకు డయాబెటిస్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశాల మేరకు జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్,సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్ రోగులకు మధుమేహ వ్యాధిపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ..మధుమేహంపై అవగాహన పెంచుకొని ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చన్నారు.జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవడం ద్వారా మధుమేహం వంటి అసంక్రమిత వ్యాధుల ముప్పును తగ్గించుకోవచ్చని తెలిపారు.రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే అధికంగా ఉండటాన్ని మధుమేహం అంటారని, తరచూ దాహం వేయడం, ఎక్కువగా మూత్ర విసర్జన,అధిక ఆకలి,అలసట,బరువు తగ్గడం,కంటి చూపు మసకబారడం,గాయాలు త్వరగా మానకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరించారు.ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారు,అధిక బరువు ఉన్నవారు,కుటుంబంలో మధుమేహ చరిత్ర ఉన్నవారు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా 30 ఏళ్లు పైబడిన వారందరికీ మధుమేహ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.జిల్లా పరిధిలోని ఆరోగ్య ఉపకేంద్రాలు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది ద్వారా పరీక్షలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.మధుమేహం నివారణకు ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక,వ్యాయామం చేయాలని,సమతుల ఆహారం తీసుకోవాలని,మిఠాయిలు,అధిక పిండి పదార్థాలు కలిగిన ఆహారాన్ని పరిమితంగా తీసుకోవాలని సూచించారు.ధూమపానం,మద్యపానానికి దూరంగా ఉండటంతో పాటు తగినంత నిద్ర,మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని తెలిపారు.ఫాస్టింగ్ బ్లడ్ షుగర్,భోజనం చేసిన రెండు గంటల తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవడం ద్వారా మధుమేహాన్ని గుర్తించవచ్చన్నారు.ప్రీడయాబెటిస్ దశలోనే తగిన జాగ్రత్తలు తీసుకొని జీవనశైలిలో మార్పులు చేసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు.ప్రజలందరూ మధుమేహంపై అవగాహన పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని,వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గ్రామస్థాయిలోనూ నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు.