telangana
బాలలే భావి భారత పౌరులు – విద్యార్థులకు విద్యా సామగ్ర పంపిణీ - డాక్టర్అ మృత్
సూర్య.నేరడిగొండ : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లను న్యూ లైఫ్ ఫౌండేషన్, ఉమన్ రైట్స్ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ జి. అమృత్ కుమార్ బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జి. అమృత్ కుమార్ మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి భారతదేశ భవిష్యత్తుకు పునాదులని, విద్యార్థులే భావి భారత పౌరులని పేర్కొన్నారు. ప్రతి చిన్నారి జీవితంలో బాల్యం ఎంతో విలువైనదని, ఆ దశలోనే వారికి మంచి ఆలోచనలు, ఉన్నతమైన ఆశయాలు, నైతిక విలువలు లవర్చుకోవాలని అన్నారు.విద్య అనేది కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకూడదని, విద్యతోపాటు సంస్కారం, వినమ్రత, క్రమశిక్షణ, దైవభక్తి, పెద్దల పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యత వంటి సద్గుణాలను కలిగి ఉండాలని సూచించారు. విద్యతో పాటు మంచి సంస్కారం కలిగినప్పుడే ఒక వ్యక్తి తన కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఉపయోగపడే ఉత్తమ పౌరుడిగా ఎదుగుతాడని తెలిపారు.
పిల్లలకు చిన్న వయస్సు నుంచే చదువుపట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు, వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు,ఉపాధ్యాయులపై ఉందన్నారు. పిల్లలకు ఆస్తిపాస్తులు ఇవ్వడం కంటే మంచి విద్య, మంచి సంస్కారం, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని అందించడం ఎంతో గొప్ప బహుమతులని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చేయూత ఫౌండేషన్ చైర్మన్ డా. ఎన్.ఆర్. రమణ, శ్రీ సరస్వతి శిశు మందిర్ నేరడిగొండ ప్రధానోపాధ్యాయురాలు మీనా, పాఠశాల ఉపాధ్యాయ బృందం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.