ప్రాణాలకు తెగించి.. జాలర్లకు పునర్జన్మ!
బేతుపల్లి చెరువులో ప్రాణరక్షకుడిగా నిలిచిన షేక్ యాసిన్‌కు ఘన సన్మానం
ఎదులాపురం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శాలువాతో సత్కారం.. యాసిన్ ధైర్యసాహసాలకు ప్రజాప్రతినిధుల ప్రశంసలు
ఆపదలో చిక్కుకున్న జాలర్ల ప్రాణాలను కాపాడి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన SDRF సిబ్బంది షేక్ యాసిన్‌ను ఎదులాపురం మున్సిపాలిటీ ఘనంగా సన్మానించింది.
ఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ : సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో ప్రమాదంలో చిక్కుకున్న జాలర్లను సాహసోపేతంగా రక్షించిన SDRF బృందం సభ్యుడు, ఎదులాపురం మున్సిపాలిటీ నివాసి షేక్ యాసిన్‌ను మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, 5వ వార్డు కౌన్సిలర్ నాగేంద్ర ప్రసాద్, 7వ వార్డు కౌన్సిలర్ బుర్ర మహేష్, 25వ వార్డు కౌన్సిలర్ కడవ నవీన్, 26వ వార్డు కౌన్సిలర్ దివ్యలు యాసిన్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశీస్సులు, ప్రోత్సాహం పొందిన యాసిన్ ఎదులాపురం మున్సిపాలిటీకి చెందిన వ్యక్తి కావడం గర్వకారణమన్నారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆపదలో ఉన్న జాలర్లను రక్షించడం గొప్ప సాహసమని కొనియాడారు. యాసిన్ చూపిన తెగువ, సేవాభావం యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.
ప్రాణాలకు తెగించి పలువురి ప్రాణాలను కాపాడిన యాసిన్‌కు అభినందనలు తెలుపుతూ, ఆయన ధైర్యసాహసాలకు ఎదులాపురం ప్రజల తరఫున సెల్యూట్ చేశారు.