దోమల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి!
దోమల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి!
కాల్వబుగ్గలో క్రిమిసంహారక దోమతెరల పంపిణీ
ఓర్వకల్లు మేజర్ న్యూస్:
దోమల నివారణకు ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి డాక్టర్ రేఖ సూచించారు. మండల పరిధిలోని కాల్వబుగ్గ గ్రామంలో శనివారం విషనాపురం పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ప్రజలకు క్రిమిసంహారక దోమతెరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ రేఖ మాట్లాడుతూ దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ దోమతెరలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని తెలిపారు.
సబ్‌యూనిట్ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేసిన దీర్ఘకాలిక ప్రభావం కలిగిన క్రిమిసంహారక దోమతెరలను సక్రమంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స పొందాలని గ్రామస్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ రాజేంద్ర, స్వాతి, ఆశా కార్యకర్త జయశ్రీ, పంచాయతీ కార్యదర్శి కౌసల్య తదితరులు పాల్గొన్నారు.