మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా ఒంగోలు పట్టణంలో విస్తృత తనిఖీలు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
సూర్య స్టేట్ బ్యూరో.
ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా శనివారం ఒంగోలు పట్టణంలో ప్రత్యేక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ ఇన్‌ఛార్జ్ సీఐ కమలాకర్ పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ చెంచయ్య, ఏఎస్ఐ షేక్ మహబూబ్ బాషా, ఈగల్ టీం (EAGLE Team) సిబ్బంది సంయుక్తంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లు, వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా వాహన తనిఖీలు, ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతరం విద్యాసంస్థల వద్ద విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, మానసిక దుష్పరిణామాలను వివరించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, విద్యపై దృష్టి సారించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ఎక్కడైనా గంజాయి విక్రయాలు లేదా అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా ఈగల్ బృందానికి తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.