telangana
రూ.9,100 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం.. మూడు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
దుద్యాల, మేజర్ న్యూస్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నవంబర్ 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను ప్రారంభించడంతో పాటు సుమారు రూ.9,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రైతులు, పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.నవంబర్ 7న ఉదయం 11 గంటలకు దుద్యాల మండలం హకీంపేటకు చేరుకోనున్న ముఖ్యమంత్రి మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను ప్రారంభిస్తారు. అనంతరం ప్రదర్శన స్టాళ్లను సందర్శించి ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత పారిశ్రామికవేత్తలతో సమావేశమై పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలపై చర్చిస్తారు. రాత్రి కొడంగల్‌లో బస చేయనున్నారు.నవంబర్ 8న ఉదయం నుంచి వివిధ మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని పలు ప్రభుత్వ భవనాలను ప్రారంభించడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.81 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఎకోపామ్ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారు. హకీంపేటలో నాట్కో సంస్థ సీఎస్ఆర్ నిధులతో రూ.4 కోట్లతో నిర్మించిన జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను, రూ.2.35 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు.
అలాగే బొంరాస్‌పేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, పోలీస్ స్టేషన్, కొడంగల్‌లో పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయం, దుద్యాలలో పోలీస్ స్టేషన్, సమీకృత మండల కార్యాలయ భవనం, కోస్గిలో సైన్స్ మ్యూజియం, దౌల్తాబాద్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలంపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.ఈ పర్యటనలో అత్యంత కీలకమైన ప్రాజెక్టుగా కోస్గి మండలం నాచారం గ్రామంలో రూ.5,060 కోట్లతో నిర్మించనున్న రేడియల్ రోడ్డు–2కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ రహదారి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కొత్తవాల్‌గూడ నుంచి నాచారం వద్ద జాతీయ రహదారి 167ఎన్ వరకు నిర్మించనున్నారు. మొత్తం రూ.9,053.48 కోట్ల అంచనా వ్యయంతో 13 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, శిలాఫలకాల ఆవిష్కరణలు నిర్వహించనున్నారు.ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా రూ.1,410 కోట్లతో 223 కొత్త, అసంపూర్తి బీటీ రహదారుల నిర్మాణం, రూ.2,100 కోట్లతో ఎంఎన్‌కేఎల్‌ఐఎస్ రెండో దశ పనులు, రూ.118.80 కోట్లతో 10 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, రూ.123 కోట్లతో కొడంగల్ వ్యవసాయ కళాశాల నిర్మాణం చేపట్టనున్నారు. అదేవిధంగా కొడంగల్, కోస్గి, మద్దూరులో రూ.41.83 కోట్లతో ఆధునిక బస్ స్టాండ్లు, మద్దూరులో రూ.20 కోట్లతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, రూ.20 కోట్లతో సమీకృత డివిజనల్ కార్యాలయ సముదాయం, రూ.59.30 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. తిమ్మారెడ్డిపల్లిలో గురులోక మసంద్ ప్రభు మందిరం అభివృద్ధికి రూ.4.45 కోట్లు, కొడంగల్ నిరంజన్ మఠం అభివృద్ధికి రూ.5.10 కోట్లు కేటాయించారు. హకీంపేట ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.10 కోట్లతో పర్యాటక హోటల్ నిర్మాణం కూడా చేపట్టనున్నారు.ఇక నవంబర్ 9న సాయంత్రం హకీంపేటకు చేరుకోనున్న ముఖ్యమంత్రి రాత్రి 7 గంటల వరకు నిర్వహించే భారీ రైతు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభకు వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది రైతులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల పర్యటనతో కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊపునివ్వడంతో పాటు రైతులు, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వనున్నట్లు ఈ పర్యటన ద్వారా స్పష్టమవుతోంది.
రిపోర్టర్: రమేష్, దుద్యాల్, వికారాబాద్ జిల్లా.