అన్నదాతలు, దళారులను నమ్మి మోసపోవద్దు : కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శివరాం రెడ్డి
మాగనూర్ సూర్య న్యూస్ :
రైతులు ఎవరూ కూడా దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారానే ధాన్యాన్ని విక్రయించి పూర్తి మద్దతు ధరను పొందాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శివరాం రెడ్డి పిలుపునిచ్చారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం మండలంలోని పలు గ్రామాల్లో తహశీల్దార్ , నాయకులు ,అధికారులతో కలిసి ఘనంగా ప్రారంభించారు.
ఐకెపి ఆధ్వర్యంలో గురు రావులింగంపల్లి, మాగనూర్, మందిపాల్ గ్రామాల్లోనూ, అలాగే పీఏసీఎస్ ఆధ్వర్యంలో వర్కూర్ మరియు అడవి సత్కారం గ్రామాల్లోనూ నూతన వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ, ప్రభుత్వం రైతుల కష్టాన్ని గుర్తించి మద్దతు ధరతో పాటు అదనపు బోనస్ అందిస్తోందని స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ముఖ్యంగా సన్న రకం ధాన్యం క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌తో కలిపి మొత్తం రూ. 2,961 అందిస్తుందన్నారు.
అదేవిధంగా లావు రకం ధాన్యం క్వింటాల్‌కు మొత్తం రూ. 2,441 అన్నారు
కాబట్టి రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి తమ వరి ధాన్యాన్ని విక్రయించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ తిప్పయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎక్స్ ఎంపీటీసీ మౌలాలి, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు, అధికారులు ,స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఆంజనేయులు, సూర్య రిపోర్టర్ మాగనూర్ మండలం