అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే చర్యలు..
సూర్య - పెద్దపల్లి: ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కె. శ్రీనాథ్ హెచ్చరించారు.
గురువారం పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్డులో ఉన్న శ్రీ సాయి, ఏజీ మార్ట్ సూపర్ మార్కెట్లలో పౌరసరఫరాలు, లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. శ్రీ సాయి సూపర్ మార్కెట్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు బియ్యం విక్రయిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు.ప్రభుత్వ నిర్ణయం ప్రకారం బీపీటీ, కేఎన్ఎం రకం బియ్యం కిలో రూ.66, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా రూ.74, హెచ్ఎంటీ, జేఎస్ఆర్ రకం బియ్యం రూ.79కు మించి విక్రయించరాదని తెలిపారు. ప్రతి సూపర్ మార్కెట్లో ధరల వివరాలను వినియోగదారులకు కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు. బియ్యం కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి రఘువీర్ సింగ్, డీటీ పోచయ్య తదితరులు పాల్గొన్నారు.