రాష్ట్ర స్థాయి సమీక్షా బృందం పర్యటన
పార్వతీపురం మన్యం, సూర్య : జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సమీక్షా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయి సమీక్షా బృందం గురువారం జిల్లాలోని వివిధ ప్రభుత్వ వైద్య ఆరోగ్య సంస్థలను సందర్శించింది. జిల్లాలో అందుతున్న వైద్య సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును ఈ బృందం క్షేత్రస్థాయిలో సమగ్రంగా సమీక్షించింది. పర్యటనలో భాగంగా రాష్ట్ర సమీక్షా బృందం జిల్లాలో రెండు బృందాలుగా ఒక బృందం జిల్లా ఆసుపత్రి, పార్వతీపురం, డిఈఐసి, సామాజిక ఆరోగ్య కేంద్రం, చినమేరంగి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రావివలసను , వేరొక బృందం సాలూరు ప్రాంతీయ ఆసుపత్రి, మెంటాడ వీధి పట్టణ ఆరోగ్య కేంద్రం, పాంచాలి హెల్త్ వెల్నెస్ కేంద్రాలం లను సందర్శించింది. ఆయా కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న వైద్య ఆరోగ్య సేవలు, సిబ్బంది పనితీరు, మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాల పనితీరు, మందుల లభ్యత తదితర అంశాలను అధికారులు కూలంకషంగా పరిశీలించారు. ఆసుపత్రులలో ఎన్‌సీడీ స్క్రీనింగ్, మాతా శిశు ఆరోగ్య సేవలు, వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాల నిర్వహణ, నాణ్యతా ధృవీకరణ సాధనకు సంబంధించిన రికార్డులను, నివేదికలను నిశితంగా పరిశీలించారు. అనంతరం వైద్య ఆరోగ్య సేవల నాణ్యతను మరింత మెరుగు పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు. లక్ష్య సాధనే ధ్యేయంగా సమీక్ష: జిల్లాలో వైద్య ఆరోగ్య సేవల నాణ్యతను మరింత పెంపొందించడం, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో ఉన్న లోపాలను గుర్తించి అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపట్టడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.