రొమ్ము క్యాన్సర్.. కణితి లేకున్నా లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు! స్టార్ హాస్పిటల్స్ వైద్యుడు డాక్టర్ సంతోష్ కుమార్
హైదరాబాద్: రొమ్ములో కణితి ఏర్పడితేనే క్యాన్సర్ వస్తుందని భావించడం సరికాదని, చర్మంలో మార్పులు, చనుమొనల నుంచి అసాధారణ స్రావాలు వంటి లక్షణాలు కూడా వ్యాధికి సంకేతాలు కావచ్చని స్టార్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజీ, హెమటాలజీ-ఆంకాలజీ నిపుణుడు డాక్టర్ సంతోష్ కుమార్ చెల్లాపురం తెలిపారు. అక్టోబర్ నెలను రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అసాధారణ మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
భారత్‌లో లక్షలాది కేసులు; దేశంలో మహిళలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ప్రధానమైనది. అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ గ్లోబోకాన్ 2022 అంచనాల ప్రకారం భారత్‌లో సుమారు 1.92 లక్షల కొత్త రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధితో 98,337 మంది మరణించారు. మహిళల్లో కొత్తగా నిర్ధారణ అవుతున్న క్యాన్సర్లలో 26.6 శాతం రొమ్ము క్యాన్సర్ కేసులే కావడం ఆందోళన కలిగిస్తోంది. వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం చికిత్స ఫలితాలపై ప్రభావం చూపుతోంది.
డాక్టర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. రొమ్ము క్యాన్సర్ విషయంలో మహిళల్లో అనేక అపోహలు ఉన్నాయని తెలిపారు. నొప్పి ఉంటేనే క్యాన్సర్ అని భావించడం, కుటుంబంలో ఎవరికీ ఈ వ్యాధి లేకపోతే తమకు రాదని అనుకోవడం సరికాదన్నారు. కుటుంబ చరిత్ర లేని మహిళల్లోనూ ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వివరించారు. వ్యాధిని తొలిదశలో గుర్తిస్తే చికిత్స మెరుగైన ఫలితాలను అందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు.
జీవనశైలితోనూ జాగ్రత్తలు; వయసు పెరగడం, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉండటం, కొన్ని జన్యుపరమైన మార్పులు, మెనోపాజ్ తర్వాత అధిక బరువు, మద్యపానం, హార్మోన్లకు సంబంధించిన కొన్ని అంశాలు రొమ్ము క్యాన్సర్ ముప్పును పెంచవచ్చని వైద్యులు చెబుతున్నారు