రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలి -నిబంధనలు ఉల్లంఘిస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటాం: అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య
నాగర్‌కర్నూల్ జిల్లాలో బియ్యం కొనుగోలు చేసే వినియోగదారులపై అదనపు భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ ధరలకే బియ్యం విక్రయించాలని జిల్లా అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య వ్యాపారులను ఆదేశించారు. నిర్ణీత ధరల కంటే అధికంగా బియ్యం విక్రయిస్తే సంబంధిత వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘాల ప్రతినిధుల సమావేశంలో వివిధ రకాల బియ్యం విక్రయాలకు గరిష్ఠ ధరలు నిర్ణయించినట్లు తెలిపారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం తెలంగాణ బీపీటీ బియ్యం కిలో రూ.66, సోనా బియ్యం కిలో రూ.74, శ్రీరామ్ గోల్డ్ బియ్యం కిలో రూ.79కు మించి విక్రయించరాదని స్పష్టం చేశారు.
రైస్ మిల్లర్లు, ట్రేడర్లు, హోల్‌సేల్ డిపో నిర్వాహకులు, చిల్లర వ్యాపారులు ఈ ధరలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. తనిఖీల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లా ప్రజలకు నాణ్యమైన బియ్యం న్యాయమైన ధరలకు అందుబాటులో ఉండేలా వ్యాపారులందరూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య కోరారు.
సందడి రవీందర్ రెడ్డి,నాగర్ కర్నూల్, రూరల్, సూర్య న్యూస్.