ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి -- టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న తిరునగరి -- 21వ రోజుకు చేరుకున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు
నారాయణపేట, సూర్యన్యూస్:
వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నో సంవత్సరాలుగా కీలక సేవలు అందిస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వారికి తగిన న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, నిమా సలహాదారు ప్రొఫెసర్ జ్యోత్స్న తిరునగరి డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 21వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఆమె దీక్షా శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైద్య ఆరోగ్య శాఖలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా అంకితభావంతో సేవలు అందిస్తున్నప్పటికీ, వారి సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యోగులంతా ఐక్యంగా ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు అండగా నిలుస్తామని, వారి డిమాండ్లను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర వర్గ సభ్యులు ఓం ప్రకాష్, నారాయణపేట జిల్లా టీడీపీ నాయకులు రాఘవరావు, చందర్, నాగర్‌కర్నూల్ జిల్లా ఎన్‌హెచ్‌ఎం ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు బాలకృష్ణ పాల్గొని ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. అలాగే ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు బిక్షపతి, అధ్యక్షుడు ప్రసాద్, కోశాధికారి రాఘవేందర్, సభ్యులు నరసింహారావు సగరి, మోనేష్ చారి, తిరుపతి, విరోజ, నవీన, శ్రీలత, అర్చన, ఐశ్వర్య, శ్వేతశ్రీ, రామస్వామి, వినోద్, సోహెల్ మునీర్, అజారుద్దీన్, ఆశాబి, రామేశ్వరి, పుష్ప, సుమిత్ర, అలివేలు పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.