ధాన్యం కొనుగోళ్లలో జాప్యం సహించేది లేదు : ఎమ్మెల్యే చింత ప్రభాకర్
సదాశివపేట;రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా కొనుగోళ్లు చేపట్టాలని, పండించిన ప్రతి గింజను ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.సదాశివపేట మండలం పెద్దాపూర్ రైతు వేదికలో నందికంది పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం సంగారెడ్డి మండలం నాగపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులందరికీ సమాన ప్రాధాన్యత కల్పించాలని, దళారీ వ్యవస్థకు తావులేకుండా నేరుగా రైతుల నుంచే ధాన్యం సేకరించాలని అధికారులకు సూచించారు. సన్న ధాన్యం పండించిన రైతులకు ప్రతి క్వింటాల్‌కు ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్ తప్పనిసరిగా అందించాలని, గత ఏడాది నుంచి పెండింగ్‌లో ఉన్న బోనస్ బకాయిలను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ కోతలు, పంట రుణాలు, ఎరువుల కొరత వంటి సమస్యలను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, ధాన్యం రవాణాలో ఎలాంటి జాప్యం జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటాయని, రైతుల సంక్షేమమే లక్ష్యంగా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాముగోపాల్, మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు, చక్రపాణి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధీర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, సుధాకర్, లక్ష్మారెడ్డి, సర్పంచ్ అశోక్ గౌడ్, రాజు, మనీష్ గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.