బియ్యం వ్యాపారులపై అధికారుల కొరడా! రైస్ ట్రేడర్స్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
సిద్దిపేట, : బియ్యం వ్యాపారులు తూనికల్లో మోసాలకు పాల్పడినా, ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు విరుద్ధంగా విక్రయాలు చేపట్టినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. వినియోగదారులకు న్యాయం జరిగేలా బియ్యం దుకాణాలపై నిరంతర తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.పౌరసరఫరాల శాఖ కమిషనర్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం సిద్దిపేట పట్టణంలోని పలు బియ్యం వ్యాపార దుకాణాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి శివరంజని, జిల్లా వస్తు సేవల పన్నుల అధికారి వేణుగోపాలరెడ్డి, పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు రాజిరెడ్డి, ఆసిఫ్ పాల్గొన్నారు.తనిఖీల్లో భాగంగా సిద్ధి వినాయక, విజయదుర్గ ట్రేడర్స్ బియ్యం దుకాణాల్లో తూనికలకు సంబంధించి తేడాలను అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి కేసు నమోదు చేశారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు!
ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం సన్న బియ్యాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారులు వ్యాపారులకు సూచించారు. వినియోగదారులకు నిర్ణీత తూనికల ప్రకారం బియ్యం విక్రయించాలని, ధరల విషయంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరించారు.ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అనుగుణంగా విక్రయాలు జరపని వ్యాపారులపై, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.వినియోగదారులకు న్యాయం చేయడం, మార్కెట్‌లో ధరల నియంత్రణ, తూనికల్లో పారదర్శకత పాటించేలా ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.