అధికారుల కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాలు?
కొండాపూర్;కొండాపూర్ మండలం మన్సాన్పల్లి గ్రామ పరిధిలోని 189 సర్వే నంబర్‌లో నిర్మాణాల వ్యవహారం అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) శుక్రవారం హెచ్చరించినప్పటికీ.. మరోవైపు వివాదాస్పద భూమిలో నిర్మాణాలు కొనసాగుతుండటం, ఒకే రోజులో పంచాయతీ అనుమతులు జారీ అయినట్లు ప్రచారం జరుగుతుండటంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.హెచ్చరికలు ఒకవైపు.. నిర్మాణాలు మరోవైపు!మన్సాన్పల్లి 189 సర్వే నంబర్‌లో అక్రమ నిర్మాణాలపై వచ్చిన కథనాలకు స్పందించిన ఎంపీఓ యాదగిరి వెంచర్ యజమానులను హెచ్చరించినట్లు సమాచారం. సంబంధిత అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హెచ్చరికలు చేసిన కొద్ది రోజులకే సదరు సర్వే నంబర్‌లో పంచాయతీ అనుమతులు జారీ అయినట్లు ప్రచారం జరుగుతుండటం అధికారుల పనితీరుపై అనుమానం ఒకే రోజులో అనుమతులు ఎలా సాధ్యం?సాధారణంగా నిర్మాణ అనుమతుల కోసం సమర్పించిన దరఖాస్తులు, భూమి వివరాలు, రెవెన్యూ రికార్డులు, సంబంధిత శాఖల అనుమతులను పరిశీలించాల్సి ఉంటుంది. అలాంటిది 189 సర్వే నంబర్‌లో ఒకే రోజులో పంచాయతీ అనుమతులు ఎలా జారీ అయ్యాయి? భూమి స్థితిగతులను పూర్తిస్థాయిలో పరిశీలించారా? రెవెన్యూ శాఖ నుంచి నివేదిక తీసుకున్నారా? నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారా? అన్న ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.వివాదాస్పద భూమిలో నిర్మాణాలు.. అధికారుల అండదండలపై అనుమానాలు!189 సర్వే నంబర్‌కు సంబంధించి ప్రభుత్వ భూమి, 22-ఏ జాబితా, నిషేధిత జాబితా, అంశాలపై వివిధ ఆరోపణలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భూమి స్వభావంపై స్పష్టత లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారా? అధికారుల అండదండలతోనే అక్రమ నిర్మాణాలకు మార్గం సుగమమవుతోందా? అన్న అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి.భూమి వాస్తవ స్థితి, అనుమతుల చట్టబద్ధత, అధికారుల పాత్రపై అధికారిక విచారణ జరిపి నిర్ధారించాల్సి ఉంది. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.జిల్లా అధికారులు స్పందించాలి!ఎంపీఓ హెచ్చరికల తర్వాత జరిగిన పరిణామాలపై జిల్లా పంచాయతీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అనుమతులు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నారు? ఏ పత్రాల ఆధారంగా మంజూరు చేశారు? రెవెన్యూ రికార్డులను పరిశీలించారా? నిబంధనలు పాటించారా? అనే అంశాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.అధికారుల హెచ్చరికలు కాగితాలకే పరిమితమవుతున్నాయా? లేక నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయా? ఒకే రోజులో అనుమతుల మంజూరు వెనుక ఏం జరిగింది? అన్న ప్రశ్నలకు ఉన్నతాధికారుల విచారణతోనే సమాధానం లభించనుంది.