telangana
రాజన్న గోపురం తొలగింపుపై బీజేపీ సమరశంఖం
సూర్య వేములవాడ: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విమాన గోపుర శిఖరం తొలగింపుపై వివాదం మరింత ముదిరింది. ఈ చర్యను నిరసిస్తూ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాపెల్లి శ్రీధర్ అధ్యక్షతన ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఆలయ అభివృద్ధి పనుల పేరుతో ప్రధాన ఆలయ గోపుర శిఖరాన్ని తొలగించడం ఆగమ శాస్త్ర నియమాలకు విరుద్ధమని బీజేపీ నాయకులు ఆరోపించారు. దీనివల్ల రాజన్న భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. గతంలో ప్రధాన ఆలయానికి, విమాన గోపురానికి ఎలాంటి నష్టం కలిగించబోమని ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆలయ పనులు ఆగమ శాస్త్ర ప్రకారమే జరుగుతున్నాయని చెబుతున్న అధికారులు, శృంగేరి పీఠం సూచనలు, అధికారిక అనుమతులు, నిర్మాణ ప్రణాళికలు, ఖర్చుల వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఆలయ అభివృద్ధి పనుల్లో పారదర్శకత పాటించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, ఎండోమెంట్ సెల్ కన్వీనర్ సత్యనారాయణ, పట్టణ ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.