telangana
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : ఇందిరమ్మ ఇళ్ల మార్కౌట్, విజిబి–జీ రామ్ జీ పనులను వేగవంతం చేయాలని
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 79 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజలు సమర్పించిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు పరిశీలించి, నిబంధనల ప్రకారం సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్. వై. గిరి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి చందర్, జిల్లా రెవెన్యూ అధికారి పాండు తదితరులు పాల్గొన్నారు.
- ఇందిరమ్మ ఇళ్ల మార్కౌట్, విజిబి–జీ రామ్ జీ పనులను త్వరగా పూర్తి చేయాలి : ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ అన్ని మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మార్కౌట్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే విజిబి–జీ రామ్ జీ పథకం కింద చేపట్టిన పనులను ప్రతి చోటా 20 నుంచి 30 మంది కూలీలతో నిర్వహించి, పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.