పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మల్కాజిగిరి సీఏఆర్‌లో మెగా రక్తదాన శిబిరం.. స్వయంగా రక్తదానం చేసిన సీపీ బి. సుమతి
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజిగిరి సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (సీఏఆర్) హెడ్‌క్వార్టర్స్‌లో బుధవారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. దేశ రక్షణ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను స్మరించుకుంటూ ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ స్వయంగా రక్తదానం చేసి పోలీస్ అధికారులు, సిబ్బందికి స్ఫూర్తినిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల రక్షణతో పాటు సమాజ శ్రేయస్సు కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ మెగా రక్తదాన శిబిరంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలువురు పోలీస్ అధికారులు, సీఏఆర్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా పోలీస్ శాఖ సామాజిక బాధ్యతను, మానవతా విలువలను చాటిచెప్పింది. అమరవీరులకు నివాళులర్పించడంతో పాటు ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం చేసే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం పలువురి ప్రశంసలు అందుకుంది.
రిపోర్టర్: పన్నాల బాల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రతినిధి.