స్థానిక పోరు: తాడిమర్రిలో బోణీ కాని ఎంపీటీసీ నామినేషన్లు
తాడిమర్రి (సూర్య రిపోర్టర్ - బండారు వెంకటేష్):
తాడిమర్రి మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నేటి నుంచి మూడు రోజుల పాటు కొనసాగనున్న ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వం మందకొడిగా ప్రారంభమైంది. నేడు, రేపు, ఎల్లుండి నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ, మొదటి రోజు మధ్యాహ్నం సమయం దాటుతున్నా నామినేషన్ల ప్రక్రియ ఇంకా వేగం పుంజుకోలేదు.మధ్యాహ్నమవుతున్నా అభ్యర్థులెవరూ ముందుకు రాకపోవడంతో నామినేషన్ల కేంద్రం వద్ద బోసిపోయిన వాతావరణం కనిపించింది. ఇప్పటివరకు ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థిగానీ లేదా స్వతంత్ర అభ్యర్థిగానీ నామినేషన్ దాఖలు చేయని పరిస్థితి నెలకొంది. మంచి ముహూర్తాల కోసం వేచి చూడడం లేదా ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా కొలిక్కి రాకపోవడమే ఇందుకు కారణమని పలువురు చర్చించుకుంటున్నారు. రానున్న రెండు రోజుల్లో నామినేషన్ల జోరు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.