*పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం*
సంగారెడ్డి;శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. విధి నిర్వహణలో భాగంగా సంఘవిద్రోహ శక్తులతో పోరాడుతూ అమరులైన పోలీసులను స్మరించుకోవడం, వారి కుటుంబాల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని గుర్తు చేశారు.పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్ తో కలిసి పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి ఘనంగా నివాళు లర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణ విధుల్లో పోలీసులు అనునిత్యం నిమగ్నమై ఉంటారని, ఈ క్రమంలో ఎదురయ్యే అనేక సవాళ్లను తమ ప్రాణాలను పణంగా పెట్టి ధైర్యంగా ఎదుర్కొంటారని అన్నారు. నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన పోలీసు అమరవీరులు జంగయ్య (సిర్గాపూర్ పోలీస్ స్టేషన్), ఎల్లయ్య (సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్), సత్యనారాయణ (జిన్నారం పోలీస్ స్టేషన్), సురేష్ (కంగ్టి పోలీస్ స్టేషన్) ప్రజల రక్షణ కోసం చేసిన వారి ధైర్య సాహసాలను, సేవలను కొనియాడారు. పోలీస్ అమరుల కుటుంబాలకు ప్రభుత్వం జిల్లా యంత్రాంగం ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు.జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పది మంది పోలీసు సిబ్బంది త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.దేశ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు.తెలంగాణ ప్రాంతంలో గతంలో నక్సలిజం ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో ఎంతోమంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన జంగయ్య, ఎల్లయ్య, సత్యనారాయణ, సురేష్ ప్రజల రక్షణ కోసం చేసిన ప్రాణత్యాగాలు పోలీసు శాఖకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అమరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు.ఈ ఏడాది దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన 154 మంది పోలీసు సిబ్బందిని ఈ సందర్భంగా స్మరించుకోవడం మనందరి బాధ్యత అని ఎస్పీ అన్నారు . వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురు పోలీసు సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అంతర్గత భద్రత, ప్రభుత్వ ఆస్తుల రక్షణతో పాటు ప్రజల్లో భద్రతాభావాన్ని కల్పించడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రథమ కర్తవ్యమని, అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది ప్రజల రక్షణకు అంకితభావంతో పనిచేయాలని ఎస్పి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలో విధినిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబీకులకు సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి చైతన్య రెడ్డి, డీఎస్పీలు, సిఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.