27 నుంచి ఈటల రాజేందర్ పాదయాత్ర
హైదరాబాద్, సూర్య ప్రధాన ప్రతినిధి :జవహర్‌నగర్ డంప్‌యార్డు వల్ల స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ పోరుబాట పట్టారు. డంప్‌యార్డును ఇక్కడి నుంచి పూర్తిగా తరలించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27 నుంచి ఆయన పాదయాత్ర చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జవహర్‌నగర్ డంప్‌యార్డు నుంచి వెలువడుతున్న మిథేన్ గ్యాస్ కారణంగా స్థానికులు తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను హరిస్తున్న ఈ సమస్యపై ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని మండిపడ్డారు.
పాదయాత్రకు ముందు కార్యాచరణలో భాగంగా.. ఈ నెల 23న జవహర్‌నగర్ బాధితులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు ఈటల తెలిపారు. అలాగే ఈ నెల 25న మేధావులు, పర్యావరణవేత్తలతో కలిసి నేరుగా డంప్‌యార్డు ఏరియాలోనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.