వికారాబాద్ అభివృద్ధే లక్ష్యం.. ప్రజల సుభిక్షం కోసం అమ్మవారిని వేడుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి , మేజర్ న్యూస్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తన సొంత నియోజకవర్గంలో దసరా వేడుకల్లో పాల్గొన్నారు. వికారాబాద్ పట్టణంలోని అలంపల్లి శ్రీ లక్ష్మీ అనంతపద్మనాభస్వామి ఆలయంలో నిర్వహించిన దసరా నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హారతి, పల్లకీ సేవలో పాల్గొని స్వయంగా స్వామివారి పల్లకీని మోశారు. ఆలయ ప్రధాన అర్చకులు, పూజారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. అనంతరం ఆలయంలోని జమ్మి చెట్టుకు సంప్రదాయబద్ధంగా శమీ పూజలు నిర్వహించి, స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లు, వాయిద్యాల మధ్య అలంపల్లి, వికారాబాద్ పట్టణ ప్రధాన వీధుల మీదుగా సాగిన ఊరేగింపులో ప్రజలు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ దసరా శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం అలంపల్లిలోని బోనమ్మ గుంత జాతర ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిలో జమ్మి పూజకు ప్రత్యేక స్థానం ఉందని, జమ్మి ఆకులను బంగారంగా భావించి పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవడం మన సంప్రదాయమని తెలిపారు. ఈ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు పాడిపంటలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. ఎల్‌నినో వంటి ప్రకృతి సంబంధిత పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే శక్తిని రాష్ట్ర ప్రజా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమ్మవారు ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజలందరూ నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వినియోగిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.వికారాబాద్ పట్టణంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పీకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, పట్టణంలో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి వికారాబాద్ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజా ప్రభుత్వం రైతులు, మహిళలు, యువతతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధి, వారి సంతోషమే తనకు ముఖ్యమని తెలిపారు.బోనమ్మ గుంత జాతర ప్రాంగణంలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలోనూ స్పీకర్ పాల్గొన్నారు.
అనంతరం జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి, ప్రజలకు అలాయ్ బలాయ్ చెప్పి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ ప్రధాన పూజారి అప్పగారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. దసరా సందర్భంగా వికారాబాద్ ప్రజా భవన్‌లోనూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్పీకర్‌ను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమాల్లో వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ చైర్మన్, వైస్ చైర్మన్ చిగుర్లపల్లి రమేష్, కౌన్సిలర్లు లక్ష్మీకాంత్ రెడ్డి, రాఘవేందర్, వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్, వికారాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, సామా ప్రభాకర్ రెడ్డి, డీఎస్పీ అంజయ్య, సీఐ రఘు కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కుమ్మరి రాఘవేందర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి.