రోడ్డు వేస్తా అంటేనే.. ఓటు అడగడానికి రావాలి..!
రోడ్డు వేస్తా అంటేనే.. ఓటు అడగడానికి రావాలి..!
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి.. నాలుగు దశాబ్దాలుగా రోడ్డు లేక ప్రజలు పడుతున్న కష్టాలు తీర్చేందుకు చర్యలు చేపడితేనే ఓటు అడగడానికి రండి అంటూ ఎమ్మిగనూరు పురపాలక సంఘం పరిధిలోని 19 వ వార్డు కాలనీవాసులుఫ్లెక్స్ ఏర్పాటు చేసి వినూత్నంగా నీరసనతో స్వాగతం పలుకుతున్నారు.. పట్టణంలోని వీవర్స్ కాలనీలో రహదారి సమస్య దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 40 సంవత్సరాలుగా నివాసం ఉంటూ మున్సిపాలిటీకి పన్నులు చెల్లిస్తున్నప్పటికీ, తమ వీధికి రోడ్డు సౌకర్యం కల్పించకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ బుధవారం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
వీవర్స్ కాలనీలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం పక్కనున్న వీధిలో రోడ్డు నిర్మించాలని స్థానికులు ఎన్నో ఏళ్లుగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నా ఫలితం కనిపించడం లేదని పేర్కొన్నారు. జిల్లా స్థాయి అధికారుల స్పందన కార్యక్రమంలో పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు.విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ తమకు న్యాయం జరగలేదని కాలనీవాసులు తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రహదారి నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తమ సమస్యను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఫ్లెక్సీ ద్వారా నిరసన తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, రహదారి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కాలనీవాసులు కోరారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.