మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దు-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
సూర్య, నంద్యాల బ్యూరో:
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్‌లు, రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ హాళ్లలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి, ప్రతి అంశాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం నంద్యాల పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో నంద్యాల మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్‌లు, రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ హాళ్ల ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి, చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్ట్రాంగ్ రూమ్‌లలో ఎన్నికల సామగ్రి భద్రపరచడం నుంచి ఓట్ల లెక్కింపు వరకు ఎలాంటి పొరపాట్లకు, నిర్లక్ష్యానికి తావులేకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉండేలా చూడాలని, లైవ్ ఫీడ్ పర్యవేక్షణకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లను ముందుగానే తనిఖీ చేయాలని ఆదేశించారు. రిసెప్షన్ సెంటర్‌లో ఎన్నికల సిబ్బంది నుంచి ఎన్నికల సామగ్రి స్వీకరణ, పరిశీలన, నమోదు, క్రమబద్ధీకరణ ప్రక్రియలు సజావుగా జరిగేలా తగిన స్థలం, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ సూచించారు. కౌంటింగ్ హాళ్లలో ఓట్ల లెక్కింపునకు అనువైన ఏర్పాట్లు చేపట్టడంతో పాటు, కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థులు, వారి ఏజెంట్లకు నిబంధనల ప్రకారం సీటింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. టేబుళ్ల మధ్య తగినంత దూరం, స్పష్టమైన ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులకు సంబంధించిన వివరాలను నిబంధనల ప్రకారం నమోదు చేసి, వాటి తరలింపు, స్వీకరణ, భద్రపరిచే ప్రతి దశలో అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, భద్రత మరియు విధుల నిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ శేషన్న సంబంధిత అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*