telangana
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
బషీరాబాద్, మేజర్ న్యూస్ : నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందని పేర్కొన్నారు. బషీరాబాద్ మండలం భోజ్యానాయక్ తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారుల కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఇళ్లలోకి అడుగుపెట్టిన కుటుంబాలకు మిఠాయిలు తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ... పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. సొంతింటి కల నెరవేరడం ప్రతి కుటుంబానికి జీవితంలో మరిచిపోలేని ఆనందమని, కొత్త ఇళ్లలోకి అడుగుపెడుతున్న కుటుంబాలను చూస్తుంటే దీపావళి పండుగ వాతావరణం కనిపిస్తోందని అన్నారు. సొంత ఇల్లు సమకూరిన కుటుంబానికి ప్రతిరోజూ పండుగ రోజేనని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ శంకర్ రెడ్డి, పీఎస్ఎస్ చైర్మన్ కరుణ అజయ్ ప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ శంకరప్ప, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ శాంతిబాయి గోపాల్, మాజీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, వైస్ చైర్మన్ చందర్ నాయక్, నర్సింలు గౌడ్, సర్పంచ్ అనిత, కాంగ్రెస్ పార్టీ నాయకులు భీమప్ప, వెంకట్ రెడ్డి, డైరెక్టర్ రవి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: కాశీం పాషా, బషీరాబాద్, వికారాబాద్ జిల్లా.