విద్యుత్ పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు నేటి సాయంత్రానికి సరఫరా అందుబాటులోకి తెస్తాం: ప్రత్తిపాటి పుల్లారావు
చిలకలూరిపేట న్యూస్: మురసు తుఫాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను గురువారం సాయంత్రానికి నియోజకవర్గవ్యాప్తంగా పునరుద్ధరిస్తామని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.గురువారం విడుదల చేసిన ప్రకటనలో ప్రజలకు ఈ మేరకు హామీ ఇచ్చారు.గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా భారీ వర్షాలు,భీకర గాలులతో నియోజకవర్గంలో తీవ్ర నష్టం జరిగిందన్నారు.పెద్దపెద్ద చెట్లు నేలకొరగడం,విద్యుత్ స్తంభాలు కూలిపోవడం,లైన్లు తెగిపోవడం,ట్రాన్స్‌ఫార్మర్లు,సబ్‌స్టేషన్లు దెబ్బతినడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని వివరించారు.విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ కోసం ఏపీ విద్యుత్ శాఖ సిబ్బందితోపాటు పొరుగు రాష్ట్రాల సిబ్బంది కూడా రేయింబవళ్లు శ్రమిస్తున్నారని తెలిపారు.దెబ్బతిన్న స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం,విద్యుత్ లైన్ల మరమ్మతులు,ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు,చెట్ల తొలగింపు పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.దాదాపు 48 గంటలుగా విద్యుత్ సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తున్నారని,వారి కష్టాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు.ప్రకృతి విపత్తుల సమయంలో ఓర్పు, సంయమనం ఎంతో అవసరమని,ప్రభుత్వానికి,అధికార యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.గురువారం సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు.