telangana
పరిశ్రమలు, ప్రకృతి సందర్శనలతో విద్యార్థులకు విజ్ఞాన యాత్ర
సూర్య, పెంచికల్‌పేట్: విద్యార్థులకు పుస్తక జ్ఞానంతో పాటు ఆచరణాత్మక అవగాహన కల్పించేందుకు నిర్వహించిన విజ్ఞాన పర్యటనలు ఆసక్తికరంగా సాగాయి. కేంద్ర ప్రభుత్వ పీఎంఎస్‌హెచ్‌ఆర్‌ఐ కార్యక్రమంలో భాగంగా పెంచికల్‌పేట్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు శనివారం కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం పరిశ్రమను సందర్శించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో కాగితం తయారీ ప్రక్రియ, యంత్రాల పనితీరు, పరిశ్రమ నిర్వహణ విధానాలను పరిశీలించారు. వృత్తి విద్య ప్రాధాన్యతతో పాటు భవిష్యత్తులో వివిధ రంగాల్లో లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అవగాహన పొందారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయనిర్మల, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.మరోవైపు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్కపల్లిలోని కిరణ్ మోడర్న్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు విసాపూర్ బొటానికల్ గార్డెన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ రకాల మొక్కలు, వృక్షాలు, పుష్పాలు, ఔషధ మొక్కలను పరిశీలించి ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను తెలుసుకున్నారు. ప్రత్యక్ష అనుభవం ద్వారా విద్యార్థులకు విజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో ఈ పర్యటన ఏర్పాటు చేసినట్లు పాఠశాల కరస్పాండెంట్, ప్రధానోపాధ్యాయులు వేముల సాయికిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.