పారిశ్రామిక వేత్తలుగా ఎదగండి :డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
రంగారెడ్డి : యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, తాము అభివృద్ధి చెందడంతో పాటు మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
ఆదివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంఖాల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్ఎస్ ఇండస్ట్రీస్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిశ్రమను స్థాపించి పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టిన యువకులు విశాల్, సాగర్‌లను అభినందించారు. ఉన్నత విద్యను అభ్యసించిన యువత ఉద్యోగాల కోసం ఇతరులపై ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడాలనే లక్ష్యంతో పరిశ్రమలు స్థాపించడం అభినందనీయమన్నారు.
స్వయంగా పారిశ్రామికవేత్తలుగా ఎదగడంతో పాటు ఇతరులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచన ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, పరిశ్రమల స్థాపనకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
విశాల్, సాగర్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించాలనుకునే యువతకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. యువతలోని నైపుణ్యం, సృజనాత్మకత, ఆలోచనా శక్తి సమాజ అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజానికి మేలు చేసే కార్యక్రమాల్లో యువ పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే KLR, ఎమ్మెల్సీ రవీంద్రరావు, సీపీఓ సౌమ్య, జీఎం ఇండస్ట్రీస్ శ్రీలక్ష్మి, పలువురు పారిశ్రామికవేత్తలు, అధికారు తదితరులు పాల్గొన్నారు.
వడ్ల శ్రీనివాస చారి : రంగారెడ్డి - మేజర్ న్యూస్