హుస్నాబాద్‌లో రేపటి నుంచి దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ శిబిరాలు మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట /హుస్నాబాద్, ; దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ హుస్నాబాద్ నియోజకవర్గంలో రేపటి నుంచి ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీకి ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. నవంబర్ 16 నుంచి 27వ తేదీ వరకు నియోజకవర్గంలోని ఏడు మండలాలు, హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
అర్హులైన ప్రతి దివ్యాంగుడు, వృద్ధుడికి అవసరమైన సహాయ ఉపకరణాలను ఉచితంగా అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. ఒక వ్యక్తి నడవడానికి, వినడానికి, చూడడానికి ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండకూడదని, ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో స్వతంత్రంగా జీవించాలన్నదే తమ సంకల్పమని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న దివ్యాంగుల సహాయ పరికరాల పంపిణీ పథకం కింద ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ సహకారంతో శిబిరాలు నిర్వహించనున్నారు.ఈ శిబిరాల్లో అర్హులకు విద్యుత్‌తో నడిచే మూడు చక్రాల వాహనాలు, చక్రాల కుర్చీలు, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలు, నడక కర్రలు, కళ్లద్దాలు, నడకకు ఉపయోగపడే సహాయక పరికరాలను ఉచితంగా అందించనున్నారు. 80 శాతానికి పైగా వైకల్యం ఉన్న అర్హులైన దివ్యాంగులకు విద్యుత్‌తో నడిచే మూడు చక్రాల వాహనాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.
శిబిరాల తేదీలు, సమయాలు, ప్రదేశాలు..
నవంబర్ 16 సైదాపూర్ , మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయ ప్రాంగణం.
నవంబర్ 17 ఎల్కతుర్తి ఎస్.ఎం.ఆర్. ఫంక్షన్ హాల్, వరంగల్ రోడ్డు.నవంబర్ 18 అక్కన్నపేట రైతు బజారు / ఉన్నత పాఠశాల.నవంబర్ 20 కోహెడ లక్ష్మీ గార్డెన్. నవంబర్ 21 చిగురుమామిడి మహాలక్ష్మి ఫంక్షన్ హాల్, చిన్న ముల్కనూరు. నవంబర్ 25 హుస్నాబాద్ గ్రామీణ ప్రాంతం మున్సిపాలిటీ. నవంబర్ 26 హుస్నాబాద్ పట్టణం మున్సిపాలిటీ.నవంబర్ 27 భీమదేవరపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల.సమయం: అన్ని శిబిరాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం.
అర్హులకు సమాచారం చేరవేయాలి..
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.గ్రామాల్లోని అర్హులైన దివ్యాంగులు, వృద్ధులను గుర్తించి శిబిరాల తేదీలు, ప్రదేశాల వివరాలను వారికి తెలియజేయాలని సూచించారు. ప్రతి గ్రామంలోని అర్హులైన వారందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా ప్రజాప్రతినిధులు, నాయకులు, యువత సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క దివ్యాంగుడు, వృద్ధుడు కూడా ప్రభుత్వ సహాయానికి దూరం కాకూడదు. ప్రతి ఒక్కరికీ అండగా నిలిచి, స్వతంత్రంగా గౌరవప్రదమైన జీవితం గడిపేలా అవసరమైన సహాయ ఉపకరణాలు అందించడమే తమ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.