శ్రీ కృష్ణదేవరాయలు, వంగవీటి మోహన రంగా విగ్రహాలను ఆవిష్కరించిన సామినేని ఉదయభాను
శ్రీ కృష్ణదేవరాయలు, వంగవీటి మోహన రంగా విగ్రహాలను ఆవిష్కరించిన సామినేని ఉదయభాను
దొండపాడు గ్రామంలో ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహావిష్కరణ అనంతరం వన సమారాధనలో పాల్గొన్న ఉదయభాను
జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, మేళ్లచెరువు మండలం, దొండపాడు గ్రామంలో శ్రీ కృష్ణదేవరాయ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణదేవరాయలు మరియు వంగవీటి మోహన రంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ముఖ్య అతిథిగా హాజరై ఇరువురు మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ, శ్రీ కృష్ణదేవరాయలు తన పరిపాలనా దక్షత, ప్రజా సంక్షేమం, సాహిత్యాభిమానం ద్వారా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని, వంగవీటి మోహన రంగా ప్రజల కోసం నిరంతరం కృషి చేసి ప్రజాభిమానాన్ని సంపాదించుకున్న నాయకుడని పేర్కొన్నారు. మహనీయుల ఆశయాలు, సేవలను భావితరాలకు తెలియజేసేలా వారి విగ్రహాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. అలాగే కార్తీక మాసంలో మున్నూరు కాపు–కాపు సామాజిక వర్గాల ఆధ్వర్యంలో వన సమారాధన నిర్వహించడం ద్వారా ఐక్యత, ఆత్మీయత, సోదరభావం మరింత బలపడతాయని పేర్కొంటూ నిర్వాహకులను అభినందించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు, గ్రామ పెద్దలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్తీక మాసం సందర్భంగా దొండపాడు గ్రామంలో మున్నూరు కాపు–కాపు సామాజిక వర్గాల ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధన కార్యక్రమంలో సామినేని ఉదయభాను పాల్గొని నిర్వాహకులు, సామాజిక వర్గాల ప్రతినిధులు, గ్రామస్థులతో ఆత్మీయంగా మమేకమయ్యారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ మున్నూరు కాపు సామాజిక వర్గాల నేతలు, జగ్గయ్యపేట కృష్ణ దేవరాయ సేవ సమితి కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ :-శివ జగ్గయ్యపేట నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా