ఒకే కుటుంబంలో 26 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు.. అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు హక్కు పొందాలి: బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభ ప్రద్ పటేల్
వికారాబాద్, మేజర్ న్యూస్: మహబూబ్‌నగర్–హైదరాబాద్–రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో దసరా పండుగ రోజున జరిగిన ఉమ్మడి కుటుంబ ఆత్మీయ కలయికలో ఒకే కుటుంబానికి చెందిన 26 మంది సభ్యులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకున్నారు. వీరిలో న్యాయవాదులు, వైద్యులు, ఇంజినీర్లు తదితర వృత్తులకు చెందిన గ్రాడ్యుయేట్లు ఉన్నారు.ఈ సందర్భంగా బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభ ప్రద్ పటేల్ మాట్లాడుతూ…, 2023 అక్టోబర్ 31వ తేదీ నాటికి డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు కోసం తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న వారు సైతం ప్రస్తుత ఎన్నికల కోసం తిరిగి ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ కుటుంబానికి చెందిన 21 మంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన కుటుంబ ఆత్మీయ కలయికలో 26 మంది సభ్యులు గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవడం సంతోషకరమని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ తమ ఓటును నమోదు చేసుకుని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవడానికి నవంబర్ 6వ తేదీ వరకు అవకాశం ఉన్నందున అర్హులైన ప్రతి ఒక్కరూ గడువులోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని శుభ ప్రద్ పటేల్ విజ్ఞప్తి చేశారు.