నూతన బోర్లకు అనుమతి తప్పనిసరి..కలెక్టర్ గరిమ అగ్రవాల్
సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లాలో వాల్టా చట్టం ప్రకారం జిల్లాలో నూతన బోర్ వెల్ వేసేందుకు తహసీల్దార్ నుంచి అనుమతి తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు.సూపర్ ఎల్ నినో నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం భూగర్భ జల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు, బోర్ వెల్ యజమానులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ లో ఆశించిన వర్షాలు కురవలేదని, చలికాలంలోనూ ఎండలు ఎక్కువగా ఉండటంతో భూగర్భ జలాలు తగ్గుతున్నాయని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజన్న సిరిసిల్లలోనే నీటి మట్టాలు అత్యంత తక్కువగా ఉన్నాయన్నారు.తాగునీటి అవసరాలకు మాత్రమే బోర్లు వేయాలని, వ్యవసాయానికి నూతన బోర్లు వేయవద్దని స్పష్టం చేశారు. అన్ని బోర్ వెల్ యజమానులు ఐడీఓసీలోని భూగర్భ జల శాఖ కార్యాలయంలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వారంలో ఎన్ని బోర్లు వేస్తున్నారో వివరాలు అందజేయాలని ఆదేశించారు.రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు.జిల్లాలో మండలాల వారీగా భూగర్భ జల మట్టాలు: బోయినపల్లి 4.78 మీటర్లు, చందుర్తి 5.31, గంభీరావుపేట 8.39, ఇల్లంతకుంట 4.65, కోనరావుపేట 7.03, ముస్తాబాద్ 8.50, రుద్రంగి 7.45, సిరిసిల్ల 14.62, తంగళ్లపల్లి 7.80, వీర్నపల్లి 13.03, వేములవాడ రూరల్ 4.81, వేములవాడ అర్బన్ 15.39, ఎల్లారెడ్డిపేట 10.91 మీటర్లు. జిల్లా సగటు 7.82 మీటర్లుగా ఉందని అధికారులు వెల్లడించారు.
సమావేశంలో భూగర్భ జల శాఖ డీడీ నాగరాజు, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, కలెక్టరేట్ పర్యవేక్షకులు వైశాలి, బోర్ వెల్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.