బియ్యం అక్రమ నిల్వలు, రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు
• జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు
సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి :
జిల్లాలో బియ్యం అక్రమ నిల్వలు, రవాణాకు పాల్పడటం, అసాధారణంగా ధరలు పెంచడం, కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా ప్రజలలో ఆందోళన కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశానికి జిల్లా పౌర సరఫరాల అధికారి వేణుగోపాల్, జిల్లా మేనేజర్ శ్రీకళ, అధికారులతో కలిసి హాజరై కమిటీ సభ్యులు, బియ్యం వ్యాపారులు, హోల్‌సేల్ వ్యాపారులు, కిరాణా వర్తకులతో బియ్యం నిల్వలు, ధరల నియంత్రణ, మార్కెట్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బియ్యం నిల్వలు, సరఫరా, ధరల విషయంలో వ్యాపారులు పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయించడం, కృత్రిమ కొరత సృష్టించడం వంటి చర్యలకు ఎట్టి పరిస్థితులలోనూ పాల్పడరాదని ప్రజలలో అనవసర భయాందోళనలు కలిగించే విధంగా వ్యవహరించవద్దని తెలిపారు. ప్రతి వ్యాపారి రోజువారీగా తమ వద్ద అందుబాటులో ఉన్న బియ్యం నిల్వల వివరాలను స్టాక్ బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలని, విక్రయ ధరలను కూడా పారదర్శకంగా అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై నిత్యావసర వస్తువుల చట్టంతో పాటు వర్తించే ఇతర చట్టాలు, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు అవసరమైన బియ్యం సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా వ్యాపారులు అధికారులకు సహకరించాలని, మార్కెట్‌లో అనవసర ధరల పెరుగుదల, అక్రమ నిల్వలు చోటుచేసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ఈ సమావేశంలో డి.హెచ్.ఓ. డిఎంఓ, డి టి సి ఎస్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.