విద్యాసంస్థలలో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
• జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి :
ప్రభుత్వ విద్యా సంస్థలలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కాసిపేట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. వంటశాలను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, ఆహారం తయారీలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసరాలను వినియోగించాలని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి, విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రేకులగూడలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను మండల పంచాయతీ అధికారి సబ్దర్ అలీతో కలిసి సందర్శించి, పాఠశాలలోని సౌకర్యాలను పరిశీలించారు.
తాండూర్ మండలంలోని తంగళ్లపల్లి గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న డి.ఎ. జుగా వసతి గృహ నిర్మాణ పనులను పరిశీలించి, నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, విద్యార్థులందరూ క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి, నూతనంగా నిర్మిస్తున్న భోజనశాల పనులను పరిశీలించారు. వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వంటశాలను తనిఖీ చేసి, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించిన సందర్భంగా, విద్యార్థులకు సరైన విద్యా వాతావరణం కల్పించడంలో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించి, సంబంధిత స్పెషల్ ఆఫీసర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.
అనంతరం బెల్లంపల్లిలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనుల పురోగతిని పరిశీలించి, నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మనోజ్ తో కలిసి నియోజకవర్గ పరిధిలోని తహసిల్దార్లతో సమావేశం నిర్వహించారు. భూభారతి, భూదాన్ భూములు, రెవెన్యూ సంబంధిత అంశాలు తదితర అంశాలపై సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, రెవెన్యూ సమస్యలను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని, చేపట్టిన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.