వాడపల్లి ఇసుక రాంప్ వద్ద రెండు బోట్లు సీజ్
వాడపల్లి ఇసుకనేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంతూర్పుగోదావరి జిల్లా వాడపల్లి ఇసుక ర్యాంప్ సమీపంలో నిషేధిత ప్రాంతం నుంచి ఇసుక తవ్వకాలు జరిపి తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఇసుకతో నిండిన రెండు బోట్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా టాస్క్‌ఫోర్స్, గనులు, భూగర్భ శాఖ, రెవెన్యూ శాఖ, జలవనరుల శాఖ అధికారులతో కూడిన సంయుక్త బృందం గురువారం తనిఖీలు నిర్వహించారు.
రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి, హేవలాక్ బ్రిడ్జి మధ్య ప్రాంతంలో రెండు బోట్ల ద్వారా ఇసుకను మాన్యువల్‌గా తవ్వి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బోట్లను అనుసరించి తనిఖీ చేయగా, ఇసుకను వాడపల్లి ఇసుక ర్యాంప్ వద్ద అన్‌లోడ్ చేసేందుకు తీసుకువస్తున్నట్లు గుర్తించారు. బోట్లలో ఉన్న వ్యక్తులను విచారించగా కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామానికి చెందిన చిక్క గోవింద్ తమను పనిలో నియమించి, ఆయనకు చెందిన రెండు బోట్లను ఇసుకతో నింపి వాడపల్లి ర్యాంప్‌కు తీసుకురావాలని చెప్పినట్లు వెల్లడించారు.
ఈ తనిఖీల్లో ఇసుకతో నిండిన రెండు బోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒక బోటుకు లేత పసుపు రంగు ఉండి, ‘శ్రీ వెంకటేశ్వర’ అనే పేరు ఉండగా, మరో బోటుకు ఎలాంటి పేరు లేదు.
నూతన ఇసుక విధానం–2024 మార్గదర్శకాల ప్రకారం వంతెనలకు 500 మీటర్ల పరిధిలో ఇసుక తవ్వకాలు నిషేధం. నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జరిపినందున, స్వాధీనం చేసుకున్న రెండు బోట్లను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కొవ్వూరు డివిజన్ జలవనరుల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు అప్పగించారు. బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
వంతెనలకు ఇరువైపులా 500 మీటర్ల పరిధిలో నిషేధిత ఇసుక తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో గనులు మరియు భూగర్భ శాఖ రాయల్టీ ఇన్‌స్పెక్టర్ డి. జ్యోతిర్మయి, టెక్నికల్ అసిస్టెంట్ పి.వి.ఎన్. శైలజ, జలవనరుల శాఖ ఏఈఈ మణికంఠ, జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.