ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ సర్వ సన్నద్ధమైంది. నవంబర్ 1న జరగనున్న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు జిల్లావ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ వెల్లడించారు. మండపేట, నిడదవోలు, కొవ్వూరు మున్సిపాలిటీల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గురువారం మండపేట పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ సందర్శించారు. అనంతరం జిల్లా అడిషనల్ ఎస్పీ దేవరాజ్ పాటిల్, ఇతర పోలీస్ అధికారులతో ఎన్నికల బందోబస్తుపై సమీక్ష నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, ముందస్తు జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మండపేట గౌతమి మున్సిపల్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి అక్కడి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మండపేట, నిడదవోలు, కొవ్వూరు ప్రాంతాల్లో గత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని గుర్తుచేశారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రస్తుత ఎన్నికలను కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. బందోబస్తు విధుల కోసం అదనంగా రిజర్వ్ ఆర్మ్‌డ్ ఫోర్స్ సిబ్బందిని కూడా వినియోగించనున్నట్లు తెలిపారు. ప్రతి ఓటరు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ఓటర్లు స్వచ్ఛందంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేలా ప్రశాంత వాతావరణాన్ని కల్పించడమే పోలీస్ శాఖ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, ఓటర్లు క్రమపద్ధతిలో పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో గుంపులుగా గుమిగూడేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సెక్షన్ 144 అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడవద్దని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాజకీయ పక్షాలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ నరసింహ కిషోర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీ ఎస్పీ రామకృష్ణ, రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ బి విద్య, ఆర్‌ఆర్ డీఎస్పీ కుమార్, ఎస్‌బీ సీఐఏ శ్రీనివాస్, మండపేట టౌన్, రూరల్ సీఐలు వాసంశెట్టి శ్రీనివాస్, పి దొరరాజు, మండపేట రూరల్ ఎస్ఐ కిషోర్, టౌన్ ఎస్ఐ రాము, రాయవరం ఎస్ఐ సురేష్ బాబు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.