మోమిన్‌పేట్‌లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ తనిఖీలు.. 14.5 లీటర్ల మద్యం, 500 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
మోమిన్‌పేట్, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా పోలీస్ శాఖ చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా మోమిన్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏసీఆర్ కాలనీలో శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా, ఐపీఎస్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, మోమిన్‌పేట్ సీఐ వెంకట్, ఎస్‌ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది కలిపి సుమారు 65 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి మొత్తం 87 వాహనాలను పరిశీలించారు. వీటిలో 75 ద్విచక్ర వాహనాలు, 6 త్రిచక్ర వాహనాలు, 6 నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి. తనిఖీల్లో అక్రమంగా కలిగి ఉన్న 14.5 లీటర్ల మద్యం, ప్రభుత్వ నిషేధిత 500 గుట్కా ప్యాకెట్లను, సుమారు రూ.1,500 విలువైన నిషేధిత వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రాజేష్ మీనా మాట్లాడుతూ ప్రజల భద్రత, నేరాల నియంత్రణ పోలీస్ శాఖ ప్రధాన ప్రాధాన్యతలని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, నిషేధిత వస్తువుల వినియోగం, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడంతో పాటు నేరాలకు అవకాశం కల్పించే పరిస్థితులను ముందుగానే గుర్తించి నియంత్రించవచ్చని పేర్కొన్నారు. కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, వాహనదారులు తప్పనిసరిగా వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలను కలిగి ఉండాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి భాగస్వాములు కావాలని అదనపు ఎస్పీ కోరారు.