తెలంగాణను వణికిస్తున్న చలి..
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను గజగజ వణికిస్తోంది. ఈ సీజన్‌లో తొలిసారిగా రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చలి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. జిల్లాలోని సత్వార్‌లో అత్యల్పంగా 9.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కోహీర్‌లో 9.7 డిగ్రీలు, న్యాల్‌కల్, ఝరాసంగంలలో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ చలిగాలుల తీవ్రత అధికంగా ఉంది. కామారెడ్డి జిల్లా డోంగ్లిలో 10.5 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా బషీరాబాద్, ధారూర్ మండలాల్లో 11 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రిపూట, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చలిమంటలు వేసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.